Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ (Republican Party) అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ (Nikki Haley) ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాన్ని ఎదుర్కొంది. న్యూ హాంప్‌షైర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమెను.. తన ఎదురుగా ఉన్న గుంపులోంచి ట్రంప్ మద్దతుదారు ఒకడు ఊహించని ప్రశ్న అడిగాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అని బిగ్గరగా అరిచాడు.
దాంతో ఆ సమావేశంలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. ఈ అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న నిక్కీ హేలీ.. కాస్త తేరుకుని నవ్వుతూ స్పందించారు. ‘నాకు మద్దతుగా ఓటు వేస్తావా?’ అని అతడిని ప్రశ్నించారు. దాంతో కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్న అతను ‘నేను ట్రంప్‌కు మద్దతుగా ఓటు వేయబోతున్నా’ అని చెప్పాడు. అతడి సమాధానంతో అసహనానికి గురైన నిక్కీ హేలీ.. ‘అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని గట్టిగా, ఘాటుగా చెప్పారు. దాంతో మీటింగ్ హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో దిగాలని భావిస్తున్న 52 ఏళ్ల నిక్కీ హేలీ.. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి పోటీదారుగా ఉన్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఇటీవల జరిగిన అయోవా రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో నిక్కీ హేలీకి 19 శాతం, ట్రంప్‌కు 51 శాతం, డిశాంటిస్‌కు 21 శాతం, మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి 7.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో తొలుత వివేక్, తర్వాత డిశాంటిస్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొని ట్రంప్‌కు మద్దతు పలికారు.
దాంతో ట్రంప్, నిక్కీ హేలీ మధ్యే హోరాహోరీ పోరు జరగనుంది. భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ అజిత్ సింగ్, రాజ్ కౌర్ రణధావా దంపతులు 1960లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. వారికి 1972లో నిక్కీ జన్మించారు. 1996లో విలియం మైఖేల్ హేలీని నిక్కీ వివాహమాడారు. నిక్కీ దంపతులకు ఇద్దరు పిల్లలు రెనా, నలిన్ ఉన్నారు. సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా గతంలో నిక్కీ రెండుసార్లు పనిచేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో ఆమె అమెరికా రాయబారిగా పనిచేశారు.