Nigeria: ఇటీవల అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న నైజీరియాలో మరోసారి కాల్పుల మోత మోగింది. సాయుధులైన దుండగులు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా ప్రజలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పలువురిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తాజా ఘటన శనివారం సాయంత్రం జరిగింది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఉత్తర నైజీరియా, నైగర్ రాష్ట్రంలోని కసువాన్-డాజి అనే గ్రామంపై కొందరు ఆయుధాలతో దాడి చేశారు. గ్రామంలో కనిపించిన వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. స్థానిక మార్కెట్ ను తగలబెట్టడంతోపాటు, పలు ఇండ్లు, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 37 మందికిపైగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరికొంతమందిని కిడ్నాప్ చేశారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని స్థానికులు తెలిపారు. బాధితులంతా పపిరి తెగకు చెందిన వారు. దుండగులు దాడి చేసినప్పటికీ.. ఇంకా తమకు సాయం, రక్షణ అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అయితే, బాధితుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. కిడ్నాప్ అయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో ఇదే ప్రాంతంలో 300 మందికిపైగా స్కూల్ విద్యార్థుల్ని, టీచర్లను దుండగులు కిడ్నాప్ చేశారు. కొంతకాలంగా ఇక్కడ క్రిస్టియన్లపై ముస్లిం సాయుధ సంస్థలు దాడులు చేస్తున్నాయి. హత్యలు, కిడ్నాప్ లు జరుగుతున్నాయి.