Tanker Blast | నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 94 మంది దుర్మరణం చెందారు. జిగావా రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీస్ ప్రతినిధి లావన్ ఆడమ్ పేర్కొన్నారు. హైవేపై ట్యాంకర్ వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడిందని పేర్కొన్నారు. వాహనం బోల్తాపడ్డ ట్యాంకర్ నుంచి ఇంధనం తీసుకువెళ్లేందుకు స్థానికులు పెద్ద ఎత్తున రావడంతో పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. గత ఆదివారం నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 48 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ పేర్కొంది. వాస్తవానికి నైజీరియాలో సరుకు రవాణాకు రైల్వే వ్యవస్థ లేవు. రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం.. 2020లో మాత్రమే 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 535 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,142 మంది గాయపడ్డారు.