Newzealand | న్యూజిలాండ్ ఎంపీ గోల్రిజ్ గహ్రమాన్ తన పదవికి రాజీనామా చేశారు. బట్టలు దొంగతనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో గోల్రిజ్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
చిన్నతనంలోనే శరణార్థిగా న్యూజిలాండ్‌కు వలస వచ్చిన గోల్రిజ్ గహ్రమాన్ న్యాయశాస్త్రం అభ్యసించారు. ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్స్‌లో కూడా పనిచేశారు. ఆ తర్వాత గ్రీన్పార్టీ తరఫున 2017లో న్యూజిలాండ్ పార్లమెంటులోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్ చట్టసభల్లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి శరణార్థిగా ఆ సమయంలో చరిత్ర సృష్టించారు. కానీ ఆ పదవిలో ఆమె సమర్థవంతంగా ఎక్కువ రోజులు కొనసాగలేకపోయారు. ఇటీవల ఆమెపై దొంగతనం ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. ఆక్లాండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోని పలు హై ఎండ్ క్లాతింగ్ స్టోర్స్‌లో గోల్రిజ్ బట్టల దొంగతనానికి ప్రయత్నించిన సీసీ టీవీ వీడియోలు బయటకు రావడంతో ఆమెపై ఈ ఆరోపణలు వచ్చాయి. దీంతో గోల్రిజ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ఎంపీ పదవికి రాజీనామా చేసిన సమయంలో దొంగతనం ఆరోపణలపై గోల్రిజ్ గహ్రమాన్ స్పందించారు. పని ఒత్తిడి కారణంగా తన మానసిక ఆరోగ్యం దారుణంగా దెబ్బతిన్నదని గోల్రిజ్ తెలిపారు. దీని కారణంగా తన వ్యక్తిత్వానికి భిన్నంగా తన చేష్టల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. తాను చేసిన పనికి సాకులు చెప్పడం లేదని.. కాకపోతే వాటికి వివరణ మాత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. తనను చట్టసభలకు పంపించడం ద్వారా ప్రజలు తనపై చాలా అంచనాలు పెట్టుకున్నారని.. కానీ వాళ్లందరినీ నిరాశ పరిచానని అన్నారు. తన వల్ల నిరాశకు గురైన వారందరికీ ఈ సందర్భంగా క్షమాపణలు తెలియజేశారు. ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం కుదుటపడాలంటే రాజీనామా చేయడమే సరైనదని భావిస్తున్నానని తెలిపారు. తొందరగా రికవరీ కావడంపై ఫోకస్ చేస్తానని వివరించారు.