Netanyahu | గడువు మరి కాసేపట్లో ముగుస్తున్నదనగా ప్రభుత్వం ఏర్పాటుకు బెంజిమిన్ నెతన్యాహు తన సమ్మతిని ప్రకటించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విజయం సాధించానని ఆ దేశాధ్యక్షుడు ఐసాక్ హెర్జోగ్కు నెతన్యాహు బుధవారం అర్ధరాత్రి సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటుకు సమ్మతి తెలిపేందుకు గడువు బుధవారం అర్ధరాత్రి వరకు ఉన్నది. దాంతో ఆయన గడువుకు కొన్ని నిమిషాల ముందు తన సమ్మతిని తెలియజేసి.. ఇజ్రాయెల్ పౌరులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. దీంతో 72 ఏండ్ల వయసున్న నెతన్యాహు ప్రమాణ స్వీకారం జనవరి 2 న జరిగేందుకు మార్గం సుగమం అయింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నెతన్యాహును అధ్యక్షుడు హెర్జోగ్ అధికారికంగా ఆహ్వానించారు. హెర్జోగ్కు ఫోన్ కాల్ అందుకున్న అనంతరం తన మద్దతుదారులతో చర్చించి ప్రభుత్వం ఏర్పాటుకు తాను సిద్ధమని తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘గత ఎన్నికల్లో మాకు లభించిన అపారమైన ప్రజా మద్దతుకు ధన్యవాదాలు. ఇది ఇజ్రాయెల్ పౌరులందరి విజయం’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు నెతన్యాహు సేవలందించారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్లోని మొత్తం 120 మంది సభ్యులకు గాను 64 మంది మద్దతును నెతన్యాహు పొందాడు. వీరంతా అల్ట్రా-ఆర్థడాక్స్ షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, రిలిజియస్ జియోనిజం, నోమ్ సభ్యులు. వీరి మద్దతుతో నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ మరోసారి ఇజ్రాయెల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో హనుక్కా సెలవులు కొనసాగుతున్నాయి. ఈ సెలవులు ముగియగానే డిసెంబర్ 26 న నెస్సెట్ సమావేశం కానున్నది. దీని తర్వాతనే జనవరి 2 కన్నా ముందుగానే నెతన్యాహు ప్రధానిగా ప్రమాణం స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.