India Mangoes | భారతదేశం నుండి దిగుమతి చేసుకునే మామిడి పండ్లపై(India Mangoes) ఎలాంటి నిషేధం లేదని నేపాల్(Nepal) ప్రభుత్వం స్పష్టం చేసింది. అధిక స్థాయిలో రసాయన పురుగు మందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నేపాల్ నిషేధం విధించామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నేపాల్ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అవి పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. నిర్ణీత ఫైటోశానిటరీ (Phytosanitary) మోతాదుకు లోబడి భారత మామిడి దిగుమతులకు అనుమతిస్తామని నేపాల్ ప్రభుత్వం పేర్కొంది.
ఈ మేరకు ఆ దేశ ‘ప్లాంట్ క్వారంటైన్, పెస్టిసైడ్ మేనేజ్మెంట్ సెంటర్ (నేపాల్ నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్)’ స్పష్టతనిచ్చింది. నిర్దేశిత వృక్ష ఆరోగ్య సంరక్షణ (ఫైటోశానిటరీ) నిబంధనలకు లోబడి ఈ దిగుమతులను అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలను పాటిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే వృక్ష ఆరోగ్య సంరక్షణ ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన తర్వాతే దిగుమతికి అనుమతులు, క్లియరెన్స్ ఆర్డర్లు జారీ అవుతున్నాయి.
నేపాల్‌కు మామిడి ఎగుమతుల్లో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తామని ఆదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరోసారి నొక్కి చెప్పింది. అలాగే నేపాల్ విధించిన కొత్త నియమాలకు అనుగుణంగా (హాట్ వాటర్ ట్రీట్మెంట్, ఫైటోశానిటరీ సర్టిఫికెట్లు) ఎగుమతులు జరుగుతున్నట్లు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, నేపాల్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం..
జనవరి 2026 నుండి భారతదేశం 2,005 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను నేపాల్‌కు ఎగుమతి చేసింది. భారతదేశం ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అందులో సుమారు 32 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎగుమ తి చేస్తుండగా.. మిగిలినవి దేశీయంగా వినియోగ మవుతున్నాయి. తాజాగా నేపాల్ ప్రకటనతో భారతీయ ఎగుమతి, దిగుమతి దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.