కాఠ్మాండు: ఎవరెస్ట్ శిఖరం(Mount Everest) ఎక్కే పర్వతారోహకులకు.. నేపాల్ సర్కారు షాక్ ఇచ్చింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆ పర్వతాన్ని ఎక్కాలంటే ఇప్పుడు భారీ ఫీజులు చెల్లించాల్సిందే. పర్వతారోహకుల ఫీజును 36 శాతం పెంచేసింది నేపాలీ ప్రభుత్వం. మౌంటనేరింగ్కు సంబంధించిన కొత్త నిబంధనలను ఆ దేశ టూరిజం శాఖ రిలీజ్ చేసింది. మార్చి నుంచి మే నెల మధ్య ఎవరెస్ట్ పర్వతాన్ని.. దక్షిణ వైపు నుంచి ఎక్కే పర్వతారోహకులకు ఫీజును 11 వేల డాలర్ల నుంచి 15 వేల డాలర్ల(సుమారు రూ.13 లక్షలు)కు పెంచినట్లు టూరిజం బోర్డు డైరెక్టర్ హారతి న్యుపేన్ తెలిపారు.
ఇదే పర్వతాన్ని సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఎక్కేవారికి ఫీజును 5500 డాలర్ల నుంచి 7500 డాలర్లకు పెంచారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య శీతాకాలంతో పాటు జూన్ నుంచి ఆగస్టు మధ్య వానాకాలంలో ఎక్కేవారి ఫీజును 2750 డాలర్ల నుంచి 3750 డాలర్లకు పెంచారు. ఎవరెస్ట్ అధిరోహకుల ఫీజు అంశంపై నేపాల్ కాబినెట్ లో ఆమోదం దక్కింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉన్నది. 2025, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త ఫీజు అమలులోకి రానున్నది.