Nepal : పొరుగుదేశమైన నేపాల్‌లో యువతరం మరోసారి భగ్గుమంది. రెండు నెలల క్రితం కేపీ ఓలీ (KP Sharma Oli) ప్రభుత్వాన్ని పడగొట్టిన కే జెన్‌జెడ్ (Gen-Z)ఈసారి ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూ (Curfew)ను తిరిగి విధించడాన్ని ఖండిస్తూ బారా (Bara) జిల్లాలో వందలాది యువత ఆందోళనలు చేపట్టారు. కొత్త సర్కార్ ఏర్పడినప్పటి నుంచి మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మద్దతుదారులు, జెన్‌జెడ్ నిరసనకారులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దాంతో.. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని పగటిపూట ఆంక్షలను మళ్లీ విధించింది. అసలే కోపం మీదున్న జెన్ జెడ్ కర్ఫ్యూను నిరసిస్తూ రోడ్డెక్కారు.
అంతర్గత వివాదాలు, సంక్షోభంతో నేపాల్ వార్తల్లో నిలుస్తోంది. అధికారం పోవడంతో మండిపోతున్న కేపీ ఓలీ పార్టీ నేతలు, కార్యకర్తలు జెన్‌జెడ్‌తో తరచూ ఘర్ణణలకు దిగుతున్నారు. తాజాగా సిమరా ప్రాంతంలో నవంబర్ 19న యువతరంతో ఓలీకి చెందిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) కార్యకర్తలు గొడవ పడ్డారు. ఇరువర్గాల ఘర్షణలతో ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని మళ్లీ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.
Just Now 🚨
Massive Violent Clashes Erupted during the protests in the Bara District, Nepal between Gen Z and CPN-UML cadres.
A curfew was imposed, and Buddha Airlines cancelled all flights on the Kathmandu-Simara route for the day.
Vidoe 📷#Ceisis #India #Nepal #government pic.twitter.com/LSHK5e6PZf
— Globally Pop (@GloballyPop) November 20, 2025
అయితే.. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన పన్నెండుమంది జెన్‌జెడ్‌తో ఘర్షణ పడ్డారు. కానీ, పోలీసులు ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన జెన్‌జెడ్ మరోసారి ఆందోళనకు దిగింది. తాము ఏర్పాటు చేయించిన ప్రభుత్వం కూడా అక్రమార్కులకు అండగా నిలవడాన్ని సహించలేకపోతోంది నవతరం. అధికారంలో ఉన్నవాళ్లు పారదర్శక పాలన చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
రెండు నెలల క్రితం నేపాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అందుకు దారి తీసిన పరిస్థితులు..అవినీతి పాలన, నాయకుల బంధుప్రీతికి తోడూ సోషల్ మీడియాపై నిషేధం విధించడం. అప్పటి ప్రధాని కేపీ ఓలీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 8న శాంతియుతంగా ఆందోళనలకు దిగారు జెన్ జెడ్. అయితే.. వీళ్లను అణచివేసేందుకు అదేరోజు పోలీసులు కాల్పులు జరపగా 19 మరణించారు.
దాంతో.. ఆగ్రహించిన యువత నిరసనలను హింసాత్మకంగా మార్చాయి. నేపాల్ పార్లమెంట్, సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్ష భవనాన్ని ముట్టించిన ఆందోళనకారులు వాటన్నింటికీ నిప్పు పెట్టారు. దాంతో.. సైన్యం ఆదేశాలమేరకే ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. అనంతరం ఆదేశ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన సుశీల కర్కి (Sushila Karki) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.