నేపిడా: మయన్మార్లో (Myanmar) సైన్యం దారుణానికి ఒడిగట్టింది. సొంత పౌరులపై వైమానిక దాడికి పాల్పడింది. బాంబుల వర్షం కురిపించడంతో వంద మందికి పైగా చనిపోయారు. వారిపై దాడి చేసింది తామేనని మయన్మార్ పాలకుడు జుంటా (Junta) ధృవీకరించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సగైగ్ ప్రాంతంలోని పజిగ్యి గ్రామంలో సైనిక వ్యతిరేక కార్యాలయ ప్రారంభోత్సవంలో సుమారు 150 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వాయుసేనకు చెందిన విమానం వారిపై బాంబులు వేసింది. ఈ ఘటనలో 100 మంది వరకు మృతి చెందారని మిలిటరీ ప్రభుత్వ (Military government) ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఆ కార్యాలయంపై దాడి జరిగిందన్నారు.
నేషనల్ యూనిటీ గవర్నమెంటుకు (NUG) చెందిన పీపుల్స్ డిఫెన్స్ (People’s Defence Force) కార్యాలయ ప్రారంభం సందర్భంగా ఈ దాడి జరిగిందని చెప్పారు. తమదే అసలైన ప్రభుత్వమని (National Unity Government) ఎన్యూజీ చెప్పుకుంటున్నదని, అది సైన్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని తెలిపారు. మృతుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఫైటర్లు కూడా ఉన్నారని, వారిలో కొందరు సాధారణ పౌరుల్లా దుస్తులు ధరించాలని చెప్పారు. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఆ ప్రాంతంలో మందుపాత్రలు పాతిపెట్టడంతోనే చాలా మంది మరణించారని ఆరోపించారు. స్థానిక ప్రజలను భయపెట్టి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. బౌద్ధ గురువులతోపాటు టీచర్లు, సాధారణ పౌరులను చంపేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే శాంతి స్థాపన కోసం మిలిటరీ ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ దాడిని ఎన్యూజీ తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలకు వ్యతిరేకంగా తీవ్రవాద మిలిటరీ చేసిన దాడి అని అభివర్ణించింది.