వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) తొలిసారిగా తన వ్యక్తిగత జీవిత వివరాలను కొన్నింటిని బహిర్గతం చేశారు. తన జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు ఉన్నాయని, తమ ఇద్దరికి జన్మించిన కుమారుల్లో ఒకరికి శేఖర్ (Sekhar) అనే పదం కలిసొచ్చేలా పేరు పేట్టామని తెలిపారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘పాడ్‌కాస్ట్’లో పాల్గొన్న మస్క్ పలు కీలక విషయాలను పంచుకున్నారు. ‘‘నాకూ శివోన్ జిలిస్‌కు (Shivon Zilis) పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టాం. భారతీయమూలాలున్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ పేరులో నుంచి శేఖర్‌ను తీసుకున్నాం. సహచరిణి శివోన్ సగం భారతీయురాలు. ఆమె తల్లి పంజాబీ. జివోన్ను చిన్నతనంలో ఉన్నప్పుడే వేరే కుటుంబం ఆమెను దత్తత తీసుకుంది. శివోన్ అలా కెనడాలో పెరిగింది’ అని చెప్పారు.
శివోన్ జిలిస్ (Shivon Zilis) ఎక్కడ పెరిగిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆమె పూర్వీకులు భారతీయులు. శిశువుగా ఉన్నప్పుడే దత్తత ఇచ్చారు. తనకు కచ్చితమైన వివరాలు తెలియకపోయినా.. శిశువుగా ఉన్నప్పుడు మాత్రం దత్తత ఇవ్వబడింది. అనంతరం కెనడాలో పెరిగింది. అలా ఆమె ఇండియన్-అమెరికన్ అయింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ అయిన జిలిస్.. 2017లో మస్క్‌కు చెందిన ఐఏ కంపెనీ న్యూరాలింక్‌లో చేరారు. ప్రస్తుతం ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తు్న్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్స్ట్ పట్టా పొందారు. ఆ సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. అనంతరం ఐబీఎం, బ్లూమ్‌బర్గ్‌లో పనిచేశారు. 2016లో ఓపెన్ఏఐలో చేరారు. జిలిస్-మస్క్ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు. 2021లో ఇద్దరు కవలలు స్ట్రైడర్, అజూర్‌కు జన్మనిచ్చారు. 2014 ఫిబ్రవరిలో కుమార్తె ఆర్కాడియా, ఆ తర్వాత మరో కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ ఉన్నారు. వారులో ఒక కొడుకు పేరులో శేఖర్‌ను చేర్చారు. కాగా, మస్క్‌కు పలువురు భాగస్వాములతో కూడా సంతానం ఉన్నారు.
పాడ్‌కాస్ట్‌లో మస్క్ మరికొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా భారతీయ ప్రతిభావంతులను నియమించుకుంటూ అమెరికా అత్యధిక లబ్ధిని పొందిందని చెప్పారు. హెచ్-1బీ వీసా (H-1B visa) ప్రోగ్రామ్ గతంలో దుర్వినియోగమైనందువల్ల, గత ప్రభుత్వాలు అత్యంత ఉదాసీనంగా వ్యవహరించినందువల్ల అమెరికాలో వలసలకు వ్యతిరేక భావాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో సరిహద్దుల్లో ఎటువంటి నియంత్రణ ఉండేది కాదని, అందరూ స్వేచ్ఛగా అమెరికాకు వచ్చేవారని చెప్పారు. సరిహద్దుల్లో నియంత్రణ లేకపోతే, అది దేశమే కాదన్నారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున అమెరికాకు వచ్చారన్నారు.
ఇది కొంత వరకు నెగెటివ్ సెలక్షన్ ఎఫెక్ట్ అని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే భావనలో వాస్తవమెంతో కచ్చితంగా చెప్పలేనన్నారు. ప్రతిభావంతుల కొరత ఉందనేది తన ప్రత్యక్ష పరిశీలన అని చెప్పారు. సంక్లిష్టమైన పనులను చేయడానికి ప్రతిభావంతులను నియమించుకోవలసి ఉంటుందని తెలిపారు. స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ వంటి టాప్ యూఎస్ కంపెనీల చీఫ్‌గా తాను ప్రతిభావంతుల కోసమే చూస్తానని, వారికి సగటు కన్నా ఎక్కువ వేతనాలు చెల్లిస్తానని చెప్పారు.
హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను కొనసాగిస్తూ, దాని దుర్వినియోగాన్ని అరికట్టాలని తెలిపారు. అమెరికాలో పని చేయాలనే ఆకాంక్ష గల భారతీయులకు ఇచ్చిన సందేశంలో, “తీసుకున్నదాని కన్నా ఎక్కువ పని చేసే వారిని నేను గౌరవిస్తాను. తీసుకునే దాని కన్నా సమాజానికి ఎక్కువ ఇచ్చే వారిగా ఉండండి. ఇన్పుట్ కన్నా ఔట్పుట్ ఎక్కువ విలువైనదిగా ఉండటంపై దృష్టి పెట్టండి” అని చెప్పారు.