Venezuela President | వాషింగ్టన్ డీసీ, జనవరి 3: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించినట్లు శనివారం ఆయన ప్రకటించారు. మాదక ద్రవ్యాల నిర్వహణ, అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మదురోను అధికారం నుంచి దింపేందుకు అనేక నెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్న అమెరికా చివరకు ఆయనను అదుపులోకి తీసుకుంది. ఇవే ఆరోపణలపై 1989లో పనామాపై దాడి చేసి ఆ దేశ సైనిక పాలకుడు మాన్యుయెల్ నొరీగాను పదవీచ్యుతిడిని చేసిన నాటి నుంచి లాటిన్ అమెరికాలో నేరుగా అమెరికా జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి.
వెనెజువెలాపై భారీ స్థాయిలో దాడులు జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బంధించి దేశం వెలుపలకు తరలించినట్లు ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ వెల్లడించారు. వెనెజువెలాను తమ అధీనంలోకి తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని 2013లో హ్యూగో షావెజ్ స్థానంలో అధికారాన్ని చేపట్టిన మదురో గతంలో ఆరోపించారు. అమెరికా భద్రతా సంస్థల సహకారంతో ఈ ఆపరేషన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపిన ట్రంప్ మరిన్ని వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని ప్రకటించారు. మదురోను ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్ ట్రూప్స్ బంధించినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
ధ్రువీకరించకుండా ఖండించిన రక్షణ మంత్రి
మదురో నిర్బంధం, తరలింపును వెనెజువెలా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఆ దేశ రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో మాత్రం అమెరికన్ చర్యను ఖండించారు. స్వతంత్ర, సార్వభౌమ దేశమైన వెనెజువెలాలో విదేశీ దళాల చొరబాటు మరణాలు, వేదన, విధ్వంసాన్ని మిగిల్చినట్లు ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ పెట్టిన సమయంలోనే పద్రినో వీడియో వెనెజువెలా ప్రభుత్వ మీడియాలో ప్రసారమైంది. కాగా, మదురోను వ్యతిరేకిస్తున్న వివిధ లాటిన్ అమెరికన్ ప్రభుత్వాలు 2024 ఎన్నికలను మదురో చోరీ చేశారని ఆరోపించాయి. అమెరికా ప్రత్యక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తూ గత దురాక్రమణలు, జోక్యాన్ని తాజా ఘటన గుర్తు చేస్తోందని లాటిన్ అమెరికన్ ప్రభుత్వాలు పేర్కొన్నాయి.
పేలుళ్ల ప్రభావంతో ఎమర్జెన్సీ ప్రకటన
వెనెజువెలా రాజధాని కరాకస్ శనివారం తెల్లవారుజామున భీకర పేలుళ్లతో దద్దరిల్లింది. దీంతో మదురో ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించి సైనిక బలగాలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చింది. మిరండా, అరాగ్వు, గుయేరా రాష్ర్టాలలో కూడా దాడులు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాదాపు గంటన్నర పాటు పేలుళ్లు, విమానాల హోరు, నల్లటి దట్టమైన పొగతో కరాకస్ కంపించిపోయింది. ఉత్తర కరాకస్‌లోని ప్రధాన సైనిక స్థావరం ఉన్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి చీకట్లు అలుముకున్నాయి. ఫ్యుర్టే టియూనా, లా కార్లోటా సైనిక స్థావరా సమీపంలో పేలుళ్లు వినిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. కాగా, వెనెజువెలా మిత్ర దేశాలైన క్యూబా, ఇరాన్ కరాకస్‌పై అమెరికా జరిపిన దాడులను ఖండించాయి.
మదురో దంపతులపై న్యూయార్క్‌లో విచారణ
పదవీచ్యుత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ న్యూయార్క్‌లో నేరారోపణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి తెలిపారు.
అధికారం చేపట్టేందుకు సిద్ధం: మచాడో
అమెరికా దళాలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని బంధించిన తర్వాత దేశానికి స్వేచ్ఛా సమయం ఆసన్నమైందని ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో శనివారం ప్రకటించారు. ‘వెనెజువెలా ప్రజలారా, స్వేచ్ఛా సమయం ఆసన్నమైంది’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 2024 జూలైలో దేశాధ్యక్షుడిగా మదురో తిరిగి ఎన్నిక అయినప్పటి నుంచి అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాడో అధ్యక్షుడిగా రాజ్యాంగ బాధ్యతలను ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ ఉరుటియా వెంటనే చేపట్టాలని పిలుపునిచ్చారు.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం