Mount Dukono : ఇండోనేసియా (Indonesia) లోని మలుకులో ఇవాళ మౌంట్ డుకోనో (Mount Dukono) అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 20 మంది పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన సమయంలో పలువురు విదేశీయులతో సహా మొత్తం 20 మంది పర్వతారోహకులు ఆ పర్వతంపై ఉన్నారని చెప్పారు. వారిలో ఏడుగురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికితీయలేదని అన్నారు.
ఇదిలావుంటే బద్దలైన అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తువరకు దట్టంగా బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు వెల్లడించారు. దాంతో రెస్క్యూ సిబ్బంది సమీప గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మౌంట్ డుకోనో అగ్నిపర్వతం మార్చి 29 నుంచి క్రియాశీలకంగా ఉండటంతో ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉందని ఇప్పటికే తాము హెచ్చరికలు జారీ చేసినట్లు ఇండోనేషియా విపత్తు నివారణ సంస్థ వెల్లడించింది. తాము లెవెల్ 2 హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. వాటిని లెక్క చేయకుండా కొందరు పర్వతారోహకులు పర్వతంపైకి వెళ్లినట్లు బీఎన్పీబీ తెలిపింది.