న్యూయార్క్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్న ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గతవారం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయా గద్దెలపై వేటువేశారు. అది మొదలు.. కంపెనీలో ఉన్నస్థానాల్లో ఉన్నవారు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు.
తాజాగా ట్విట్టర్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్, ప్రకటనల విభాగం అధిపతి అయిన సారా పెర్సోనెట్, చీఫ్ పీపుల్ అండ్ డైవర్సిటీ ఆఫీసర్ దలానా బ్రాండ్, కోర్ టెక్నాలజీస్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డ్వెల్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్, ట్విటర్ ప్రొడక్ట్ హెడ్ జే సుల్లివన్, గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ మహ్యూ.. సంస్థకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాన్ మస్క్.. కంపెనీలో సమూల మార్పులు చేపడుతున్న వేళ పలు విభాగాల అధిపతులు తప్పుకోవడం గమనార్హం.
కాగా, ట్విట్టర్ బోర్డు సభ్యులందరిపై మస్క్ వేటు వేసిన విషయం తెలిసిందే. బోర్డు సభ్యులను తొలగించినట్లు సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో మస్క్ పేర్కొన్నారు. బోర్డులో తానొక్కడినే డైరెక్టర్ అని, అయితే ఇది తాత్కాలికమేనని వెల్లడించారు. బోర్డులో ఏకైక సభ్యుడిగా ఉన్న మస్క్.. సీఈవోగా కొనసాగనున్నట్టు సమాచారం.
ఇక కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను రోజుకు 12 గంటలు పనిచేయాలని అంతర్గతంగా ఆదేశించినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ఏడు రోజులూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ అధినేత మస్క్ నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి రోజులో 12 గంటలు, వారం రోజులూ పనిచేయాల్సిందేనని ఆదేశించినట్లు వెల్లడించాయి.