వాషింగ్టన్: అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 31 మంది చిన్నారులకు మంకీపాక్స్ సోకింది. 11 రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా పేర్కొన్నది. కాగా, అగ్రరాజ్యంలో మొత్తం 18,989 మంకీపాక్స్ కేసులు రికార్డయ్యాయని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది. వైరస్ కారణంగా టెక్సాస్‌కు చెందిన వ్యక్తి మృతిచెందాడు. అయితే అతని మరణానికి మంకీపాక్సే కారణమని సీడీసీ ఇంకా ధృవీకరించలేదు.
నివారణ చర్యలు చేపట్టినప్పటికీ మంకీపాక్స్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని సీడీసీ డైరెక్టర్ రోచెల్లి వాలెన్స్కీ తెలిపారు. ఈ నెల నుంచి మంకీపాక్స్ వ్యాక్సిన్ ప్రజలకు అదనంగా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మంకీపాక్స్ కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో మూడో వంతు కేవలం న్యూయార్క్ నగరంలోనే ఉండడంతో హాట్ స్పాట్ గా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 80కిపైగా దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయి.