Monkey pox | మంకీపాక్స్ పేరును ఎంపాక్స్‌గా మార్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. మంకీపాక్స్‌ను ఇకపై ఎంపాక్స్‌గా పిలువనున్నట్లు సోమవారం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులతో వరుస సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నది. ఏడాది పాటు రెండు పేర్లను వినియోగించనున్నట్లు పేర్కొన్న సంస్థ.. ప్రపంచ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో పేరు మార్చడం వల్ల తలెత్తే గందరగోళాన్ని నివారించేందుకు రెండు పేర్లను వినియోగించనున్నట్లు తెలిపింది.
ఎంపాక్స్ ఓ అరుదైన వైరల్ వ్యాధి. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్య ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ తొలిసారిగా గుర్తించారు. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. మంకీపాక్స్ కేసులు మే నుంచి అనేక దేశాల్లో నమోదయ్యాయి. అమెరికాలోనే దాదాపు 30వేల కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా దేశాల్లో వైరస్ స్థానికంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చాలా వరకు లైంగిక సంబంధాల ద్వారానే సోకినట్లు గుర్తించారు. అయితే, మంకీపాక్స్‌కు టీకా వేయడం ద్వారా పరిస్థితిలో కొంత మేర అడ్డుకట్ట వేయగలిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.