బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 17:07:16

మోదీ రామాలయం కడుతున్నాడు.. ఇమ్రాన్ కృష్ణాలయం కట్టాలి..

మోదీ రామాలయం కడుతున్నాడు.. ఇమ్రాన్ కృష్ణాలయం కట్టాలి..

ఇస్లామాబాద్ : అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వినూత్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే, ఆ డిమాండ్ మన దేశానికి, మన దేశ నేతలకు చేసింది కాదు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అక్కడి ప్రతిపక్ష పార్టీ నేతలు చేసింది.

అయోధ్యలోని రామ్ ఆలయానికి చెందిన భూమి పూజను ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపారు. దీనికి సరైన సమాధానం ఇచ్చేందుకు పాకిస్థాన్ లో కృష్ణ ఆలయాన్ని నిర్మించి చూపాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) డిమాండ్ చేసింది. బిలావల్ భుట్టో జర్దారీ ప్రతినిధి, పీపీపీ ఎంపీ కూడా అయిన ముస్తఫా నవాజ్ ఖోఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నరేంద్ర మోదీకి ఖచ్చితమైన సమాధానం ఇవ్వడం అవసరం. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వెంటనే ఇస్లామాబాద్‌లో కృష్ణ దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించాలి. ఇందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆలయ నిర్మాణంలో వస్తున్న సమస్యలన్నీ వెంటనే తొలగించేలా చూడాలి. ఇస్లామాబాద్‌లో కృష్ణ ఆలయాన్ని నిర్మించడం ద్వారా పాకిస్థాన్‌లో అన్ని మతాలు గౌరవించబడుతున్నాయని ప్రపంచానికి తెలియజేయగలుగుతాం అని నవాజ్ ఖోఖర్ పేర్కొన్నారు.

ఇస్లామాబాద్‌లో ఆలయ నిర్మాణం ఎందుకు ఆగిపోయింది?

పాకిస్తాన్ రాజధాని నగరమైన ఇస్లామాబాద్ లో కృష్ణాలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన రాగానే.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం హెచ్-9 / 2 సెక్టార్లో భూమి కేటాయించింది. దీని పునాది పనులు రెండు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. అయితే, మౌలికవాదుల ఒత్తిడితో ప్రభుత్వం నిర్మాణ పనులను నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొందరు ఆలయం పునాది రాళ్లను తొలగించారు. దీనికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశమైనందున మేము చెల్లించే పన్ను డబ్బుతో కృష్ణాలయాన్ని నిర్మించలేరు అని వేర్పాటువాదులు నిక్కచ్చిగా చెప్పారు. దాంతో పునాది రాళ్ల వద్దనే కృష్ణాలయ నిర్మాణపనులు నిలిచిపోయాయి.

హైకోర్టుకు ఆలయ నిర్మాణ విషయం 

ఇస్లామాబాద్‌లో ఆలయ నిర్మాణాన్ని ఆపాలంటూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మూడింటినీ హైకోర్టు తిరస్కరించింది. ఆలయ నిర్మాణం కోసం సంబంధిత ఏజెన్సీల అనుమతి కోరడం అవసరమని హైకోర్టు తెలిపింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ఆలయాన్ని నిర్మించడానికి 2017 లోనే భూమి కేటాయించారు. 2018 లో దీనిని హిందూ పంచాయతీకి ఆ భూమిని అప్పగించారు. అయినప్పటికీ, ఆలయ నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం మౌలికవాదుల ఒత్తిడిలో ఉన్న కారణంగానే కృష్ణాలయం పనులు నిలిచిపోయాయని పీపీపీ ఆరోపిస్తుండటం విశేషం. పీపీపీ చేసిన డిమాండ్ ను తీసుకుని ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కృష్ణ ఆలయం నిర్మాణ పనులు చేపడుతుందో.. లేదో వేచిచూడాలి.


logo