సనా: యెమెన్‌లో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. కొంత మంది పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి మారిబ్ నగరంపై హౌతీ దళాలు క్షిపణి దాడి చేసినట్లు పభుత్వ మీడియా శుక్రవారం తెలిపింది. అల్-మటర్ ప్రాంతంలోని సైనిక భవనం పక్కన క్షిపణి పడినట్లు స్థానికులతోపాటు వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ దాడిలో 28 మంది వరకు పౌరులు చనిపోయి ఉంటారని సేవ్ ది చిల్డ్రన్ సహాయ సంస్థ గురువారం తెలిపింది. ఏడేండ్ల పాటు కొనసాగుతున్న భయానక పోరాట పరిస్థితుల నుండి పౌరులను మినహాయించాలని ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొంది.
కాగా, యెమన్ ప్రభుత్వం ఆధీనంలోని చివరి ఉత్తర కోట మారిబ్ నగరం. ఇంధన ఉత్పత్తిలో కీలకమైన ఈ ప్రాంతం గత కొన్నేండ్లుగా పోరాట కేంద్రంగా ఉన్నది. ఇరాన్, హౌతీ దళాలు నగరం వైపునకు చేరుకున్నాయి. దీంతో రెండు వైపులా సైనిక కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. ఐరాస నేతృత్వంలోని కాల్పుల విరమణ ప్రయత్నాలను ఇది దెబ్బతీసింది.