బ్యాంకాక్: థాయ్లాండ్-కంబోడియా సరిహద్దుల్లో సోమవారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో తమ సైనికులు ఇద్దరు చనిపోయారని, నలుగురు గాయపడ్డారని రాయల్ థాయ్ ఆర్మీ మంగళవారం పేర్కొంది. కంబోడియా దాడులను ఎదుర్కోవడానికి ఫైటర్ జెట్లను మోహరించినట్టు వెల్లడించింది. థాయ్ సైన్యం అధికార ప్రతినిధి మాట్లాడుతూ చొంగ్ బక్ ప్రాంతంలో తమ సైనికులపై హఠాత్తుగా ఆయుధాలతో దాడి జరిగిందన్నారు. దీంతో జాతీయ, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కంబోడియా సైనిక స్థావరాలపై తమ సైన్యం దాడి చేసిందన్నారు. అయితే థాయ్లాండ్ దళాలే తమపై ఆదివారం, సోమవారం దాడులు చేశాయని కంబోడియా లెఫ్టినెంట్ జనరల్ మాలి సొచి తెలిపారు. ఈ దాడులు అమానవీయమని.. ఈ దాడుల్లో నలుగురు పౌరులు చనిపోయారని తెలిపారు. థాయ్లాండ్ జాతీయంగా, అంతర్జాతీయంగా దాడుల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని కంబోడియా ఆరోపించింది. థాయ్లాండ్ దాడుల సమయంలో తమ దళాలు అత్యంత సంయమనాన్ని పాటించాయని, ప్రతీకారం తీర్చుకోలేదని కంబోడియా రక్షణ మంత్రి తెలిపారు.