Militants overran | పాకిస్తాన్‌లోని మారుమూల ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌పై మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. వీరి దాడిలో ఇద్దరు పోలీసులు హతమయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ వ్యానును దుండగులు తగలబెట్టారు. వ్యానులోని ఆయుధాలతో పరారయ్యారు. ఈ ఘటన దక్షిణ వజీరిస్తాన్లోని గిరిజన జిల్లాలో గురువారం ఉదయం జరిగింది.
పోలీసుల కంటే ఎక్కువ సంఖ్యలో మిలిటెంట్లు దాడిలో పాల్గొనడంతో ప్రతిఘటించడం పోలీసులకు కష్టం మారింది. మిలిటెంట్ల దాడి సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలతో కూడిన భారీ బలగాలు సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు డీపీఓ అతావుల్లా తెలిపారు. అనుమానిత మిలిటెంట్ల దాడిపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.
దక్షిణ వజీరిస్తాన్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు, గిరిజన పెద్దలు ప్రదర్శన నిర్వహించారు. నానాటికి పెరిగిపోతున్న తీవ్రవాదాన్ని అణిచివేయాలంటూ ర్యాలీలో నినదించారు. వజీరిస్తాన్‌లో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన పెద్దలు, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.