న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్(Microsoft) సాఫ్ట్వేర్ సంస్థలో ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. ఆ కంపెనీకి చెందిన టెక్నాలజీని.. గాజాలో జరుగుతున్న యుద్ధంలో వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొందరు ఉద్యోగులు ఆ సంస్థ యాజమాన్యంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు అజూర్ టెక్నాలజీని ఇజ్రాయెల్ సైన్యానికి అమ్మినట్లు అంగీకరించింది. కానీ గాజా యుద్ధంలో ఆ టెక్నాలజీ వాడేందుకు కాదు అని మైక్రోసాఫ్ట్ సంస్థ తన బ్లాగ్‌లో వెల్లడించింది. ఇజ్రాయిలీ బంధీలను గుర్తించేందుకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని ఆ దేశం వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గాజాలో ప్రజలను హింసించేందుకు అజూర్ ప్లాట్‌ఫామ్ కానీ, ఏఐ టెక్నాలజీ కానీ వాడినట్లు ఎక్కడా ఆధారాలు లేవని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది.
ఇజ్రాయెల్ మిలిటరీతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు మూడు నెలల క్రితం ఓ మీడియా సంస్థ వార్తలు ప్రచురించింది. 2023, అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏఐ ఆధారిత ఉత్పత్తులను ఇజ్రాయెల్ అధిక స్థాయిలో వినియోగించింది. సుమారు 200 రెట్లు ఆ వాడకం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అజూర్ టెక్నాలజీ ద్వారా నిఘా సమాచారాన్ని ట్రాన్స్‌స్క్రైబ్, ట్రాన్స్‌లేట్ చేసి.. ఆ తర్వాత దాన్ని ఏఐ ఆధారిత వ్యవస్థలతో క్రాస్ చెక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లను వాడుకుని పాలస్తీనియన్ ప్రజలను ఇజ్రాయిలీలు వేధించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని మైక్రోసాఫ్ట్ చెబుతున్నది.
ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆ కంపెనీ 50వ వార్షిక వేడుకలను అడ్డుకున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తాఫా సులేమాన్ ఓ యుద్ధ పిపాసి అని, అతను యుద్ధం నుంచి లాభపడుతున్నట్లు ఓ ఉద్యోగి ఆరోపించారు. తమ ప్రాంతంలో జరుగుతున్న మారణహోమాన్ని అడ్డుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఏఐ టెక్నాలజీ వాడకాన్ని నిలిపివేయాలని ఓ ఉద్యోగి డిమాండ్ చేశారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్, సీఈవో సత్యా నాదెళ్ల కార్యక్రమాలను కూడా మరో నిరసనకారుడు అడ్డుకున్నారు. ఆ ఇద్దరు మాజీ ఉద్యోగులు.. వేలాది మంది కంపెనీ వర్కర్లకు ఈమెయిల్స్ కూడా చేశారు. ఇజ్రాయెల్ సైన్యానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ తన సాఫ్ట్వేర్, క్లౌడ్ సర్వీసెస్ అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిరసనకారులు ఇబ్తిహల్ అబౌసద్, వానియా అగర్వాల్ ను ప్రస్తుతం కంపెనీ నుంచి తొలగించారు.