Jeff Bezos | న్యూయార్క్, ఫిబ్రవరి 14: లాభాల పంట పండే ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టడం వ్యాపారవేత్తల మొదటి లక్షణం. ప్రపంచ కుబేరులంతా కృత్రిమ మేధ, అంతరిక్ష పరిశోధనల్లో పెట్టుబడులపై దృష్టి పెట్టగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం.. ఆవుల అపానవాయువును నివారించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు తన బెజోస్ ఎర్త్ ఫండ్ నుంచి ఏకంగా రూ.81 కోట్లు వెచ్చిస్తున్నారు. పర్యావరణ మార్పుపై పోరాటానికి ఈ నిధిని ఉపయోగిస్తున్నారు. పర్యావరణ మార్పు అనగానే కాలుష్యం, కార్బన ఉద్గారాలపైనే అందరి దృష్టి ఉంటుంది. జెఫ్ బెజోస్ మాత్రం భిన్నంగా ఆలోచించారు.
ఆవులతో పాటు మేకలు, గొర్రెలు వంటి ఆహారాన్ని నెమరువేసే జంతువుల్లో అరుగుదల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. వీటి పొట్టల్లో ఆహారం పులియబడుతుంది. ఈ క్రమంలో వాటిలో మీథేన్ వాయువు ఉత్పత్తి అయి తేన్పులు, అపానవాయువు ద్వారా పర్యావరణంలోకి విడుదలవుతుంది. మీథేన్ కూడా గ్రీన్‌హౌజ్ గ్యాస్‌లలో ఒకటి. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే దాదాపు 28 రెట్లు అధికంగా పర్యావరణానికి నష్టం చేస్తుంది. ఆవుల నుంచి మీథేన్ ఉద్గారాలు తగ్గించేందుకు యూకేలో పిర్‌బ్రైట్ ఇన్స్టిట్యూట్, న్యూజిలాండ్‌లోని అగ్రీసెర్చ్, యూకేలోని రాయల్ వెటర్నరీ కాలేజ్ కలిసి వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయి. ఈ పరిశోధనకు జెఫ్ బెజోస్ తన బెజోస్ ఎర్త్ ఫండ్ నుంచి రూ.81 కోట్లు ఖర్చు చేస్తున్నారు.