శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ టెక్ దిగ్గజం మెటాలో (Meta) భారీగా ఉద్యోగాలకు కోతలు (Layoffs) పడనున్నాయి. పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించారని, వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. మొత్తం 3600 మందిని తొలగించనున్నట్లు తెలుస్తున్నది. మెటా నేతృత్వంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్స్ఆప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఉన్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థల్లో గతేడాది సెప్టెంబర్ నాటికి 72,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఉద్యోగాల కోతలపై మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) స్పందించారు. పనితీరు సామర్థ్యాన్ని పెంచే క్రమంలో తక్కువ పనితీరును కనబరుస్తున్నవారిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కంపెనీని బలోపేతం చేసేందకు పని ఆధారంగా కోతలు విధిస్తున్నామని, వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందే మెటాలో ఉద్యోగుల మార్పులు చేర్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్, జుకర్‌బర్గ్ మధ్య విభేదాలు ఉండేవి. 2021లో అమెరికా పార్లమెంటు భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయనను ఫేస్బుక్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. 2023లో మళ్లీ ఆయన అకౌంట్‌ను పునరుద్ధరించారు. అయినప్పటికీ మెటా చీఫ్‌పై ట్రంప్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందడంతో.. ఆయన యంత్రానికి అనుకూలంగా జుకర్ బర్గ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతవారం తన సోషల్ మీడియా వేదికల్లో ఫ్యాక్ట్ చెకింగ్ ఫీచర్‌ను తొలగించారు.