వాషింగ్టన్ : టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉన్నది. ఆటోమేషన్‌లో భారీ పెట్టుబడులు, కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం కారణంగా చాలా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం మే 20న ప్రారంభయ్యే మలి విడత కోతలు ఈ ఏడాది చివరి నాటికి కొనసాగే అవకాశం ఉన్నది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 10 శాతం మందిని (సుమారు 8 వేల మంది) ఇప్పటికే తొలగించాయి. ఒక్క నెలలోనే మెటా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో సుమారు 46,750 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
అమెజాన్ కూడా ఇటీవల సుమారు 30 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ కంపెనీ 51 ఏండ్ల చరిత్రలో తొలిసారి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం అమలవుతున్నది. ఈ ఏడాది ద్వితియార్థంలో మరిన్ని కోతలకు ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మెటా సీఈవో జుకర్‌బర్గ్ ఈ విషయమై ఇప్పటికే ఉద్యోగులకు సూచన చేస్తూ ఏఐ వల్ల పెద్ద టీమ్‌ల అవసరం తగ్గొచ్చని తెలిపారు. మరోవైపు వచ్చే నెల్లో మరో 8 వేల మంది ఉద్యోగులను మెటా ఇంటికి పంపనుంది.