Sports | టోక్యో, ఏప్రిల్ 21: క్రీడలు చూడటం వల్ల వినోదం పొందడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయంటున్నారు జపాన్‌కు చెందిన పరిశోధకులు. క్రీడలు చూసే వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని వీరు ఒక అధ్యయనం ద్వారా గుర్తించారు. టోక్యోలోని వసేడా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. మానసిక ఆరోగ్యంపై క్రీడలు ఎలాంటి ప్రభా వం చూపిస్తున్నాయనేది కనుగొనేందుకు ఒక అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనం మూడు భాగాలుగా జరిగింది. మొదట 20 వేల మంది జపాన్ ప్రజలపై అధ్యయనం జరిపారు. తర్వాత 208 మంది క్రీడలు చూసే ముందు, చూసిన తర్వాత వారి మెదళ్లలో వచ్చిన మార్పులను పరిశీలించారు. చివరగా, క్రీడలు చూస్తున్నప్పుడు మెదడు పనితీరులో వచ్చిన మార్పులను పరిశోధకులు న్యూరోఇమేజింగ్ పద్ధతుల ద్వారా గుర్తించారు. క్రీడలు ఎక్కువగా చూసే వారి మెదడులో గ్రే మ్యాటర్ ఎక్కువగా ఉంటుందని, మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని, మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నారని ఈ అధ్యయనం ద్వారా పరిశోధకులు తేల్చారు.