Donald Trump : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి రెండు దేశాలు కలిసి మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలని సలహా కూడా ఇచ్చారు. అణు క్షిపణుల (Nueclear Missile) తో యుద్ధాలు వద్దని చెప్పారు. సౌదీ అరేబియాలో యూఎస్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో ట్రంప్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ట్రంప్ తనను తాను శాంతికర్తగా అభివర్ణించుకున్నారు. అణ్వాయుధ దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు హాజరయ్యారు. భారత్-పాకిస్థాన్ మధ్య అణుయుద్ధాన్ని నివారించడానికి తన మధ్యవర్తిత్వం సాయపడిందని ట్రంప్ తెలిపారు. అది లక్షలాది ప్రాణాలను కాపాడిందని అన్నారు.
ఉద్రిక్తతలు మరింత తగ్గేందుకు భారత్, పాకిస్థాన్ దేశాలు మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ‘ఇరుదేశాల మధ్య శాంతి ప్రక్రియలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోలు పాలుపంచుకున్నారు. ఇరు దేశాల పరిస్థితి బాగుందని అనుకుంటున్నా. వాళ్లని మనం ఒకచోట చేర్చవచ్చు. మార్కో రూబియో, వాళ్లు కలిసి బయటకు వెళ్లి మంచి విందు చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది కదా?’ అని ట్రంప్ ఫోరమ్‌లో వ్యాఖ్యానించారు.
‘కొన్ని రోజుల క్రితమే భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి చరిత్రక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేయడంలో మా యంత్రాంగం విజయవంతమైంది. ఈ విషయంలో నేను వాణిజ్య అంశాలను ఎక్కువగా ఉపయోగించాను. సహచరులారా రండి. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందాం. వ్యాపారం చేద్దాం. అణు క్షిపణుల వాణిజ్యం చేయొద్దు. అందరికీ ఆనందం కలిగేలా చేద్దాం. భారత్-పాక్ పాలకులు శక్తిమంతమైన, ఉత్తమ, తెలివైన నేతలు. యుద్ధం నిలిచిపోయింది. ఇది అలాగే కొనసాగాలని ఆశిద్దాం’ అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆహూతులంతా చప్పట్లతో ట్రంప్‌ను అభినందించారు.
అయితే కాల్పుల విరమణ విషయంలో మూడోపక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరిస్తోంది. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) తమంతట తాము అవగాహనకు వచ్చారని, ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయం లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ మళ్లీమళ్లీ చెప్పుకుంటుండటం గమనార్హం.