Greenland |న్యూఢిల్లీ: గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్వ్యాప్తంగా శనివారం భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లోని సిటీ హాలు ఎదుట వేలాదిమంది నిరసనకారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్హస్, ఆల్బోర్గ్, ఓడీఎన్స్, నూక్ తదితర డచ్ నగరాలలో కూడా శనివారం భారీ నిరసన ర్యాలీలు జరిగాయి. గ్రీన్లాండ్లో కూడా శనివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి.
గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రకటనలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలియచేస్తున్నట్టు జాతీయ ప్రతినిధి సంఘం చైర్పర్సన్ కామిల్లా సీజింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. డానిష్ రాజ్యాన్ని, గ్రీన్లాండ్ ప్రజల స్వయం నిర్ణాయక హక్కును గౌరవించాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రీన్లాండ్కు ప్రపంచ దేశాల మద్దతును కూడగడతామని ఆమె ప్రకటించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, గ్రీన్‌లాండ్‌పై ఆశపడొద్దు అన్న నినాదాలతో వేలాదిమంది నిరసనకారులు డెన్మార్క్వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించినట్టు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.