న్యూయార్క్, జనవరి 2 : కొత్త సంవత్సర వేడుకల వేళ వరుస దాడులతో అమెరికాలో భయాందోళనలు నెలకొన్నాయి. 24 గంటల వ్యవధిలో మూడు దాడులు జరగడం, దాడులన్నీ ఉగ్రవాద చర్యలనే అనుమానాలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మూడు దాడుల్లో 16 మంది మరణించగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం న్యూఓర్లీన్స్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో మొదటి దాడి జరగగా, కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ టవర్ సమీపంలో పేలుడు సంభవించింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని ఓ నైట్‌క్లబ్ ముందు మూడో దాడి చోటు చేసుకున్నది. మరోవైపు న్యూఓర్లీన్స్‌లో దాడికి తెగబడ్డ వ్యక్తి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో ప్రేరేపితమయ్యాడని పోలీసులు గుర్తించారు. దీంతో మిగతా రెండు దాడులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం, సమన్వయంతో జరిగాయా అనే దిశగా దర్యాప్తు జరుగుతున్నది.
లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ పార్కింగ్ స్థలంలో బుధవారం పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో నిండి ఉన్న టెస్లా సైబర్ ట్రక్‌లో పేలుడు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హోటల్ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందినది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి మరణించగా, సమీపంలో ఉన్న మరో ఏడుగురికి గాయాలైనట్టు లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ఉగ్రవాద చర్య అని, మృతుడే నిందితుడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ట్రక్కును అద్దెకు తీసుకున్న కొలరాడో స్ప్రింగ్స్‌లో ఎఫ్‌బీఐ సోదాలు జరుపుతున్నది. దాడికి పాల్పడిన నిందితుడి పేరు అధికారికంగా ప్రకటించలేదు.
న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మూడో దాడి జరిగింది. బుధవారం రాత్రి ఒక నైట్ క్లబ్ బయట నిలబడ్డ వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు దాదాపు 30 సార్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల తర్వాత నిందితులు కారులో పారిపోయినట్టు తెలిపారు.
న్యూ ఓర్లీన్స్ దాడి నిందితుడు 2005-20 మధ్యకాలంలో అమెరికా సైన్యంలో హెచ్ఆర్, ఇన్ఫర్మేషన్ మేనేజర్‌గా పని చేశాడు. యువకుడిగా ఉన్నప్పుడు అతడు ఇస్లాంలోకి మారాడని అధికారులు అనుమానిస్తున్నారు. అద్దె ఇంట్లో అతడు పేలుడు పదార్థాలను తయారుచేసినట్టు గుర్తించారు. అతడు ఐసిస్ లోన్ ఉల్ఫ్(ఉగ్రవాద సంస్థతో ప్రేరేపితమై ఒంటరిగా పని చేసే వ్యక్తి)గా భావిస్తున్నారు.
మరోవైపు న్యూ ఓర్లీన్స్లో కొత్త సంవత్సర వేడుకల్లో జరిగిన దాడి ఉగ్రవాద ప్రేరేపిత చర్యగా ఎఫ్‌బీఐ అనుమానిస్తున్నది. ఈ ఘటనలో నిందితుడిని షంషుద్దీన్ జబ్బర్‌గా గుర్తించారు. అతడే ఫోర్డ్ ఎఫ్-150 ట్రక్కును అద్దెకు తీసుకొని దాడికి తెగబడ్డాడని తేలింది. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా భావించి విచారణ జరుపుతున్నామని, ఎక్కువమందిని హతమార్చాలనే లక్ష్యంతోనే నిందితుడి ప్రవర్తన ఉందని ఎఫ్‌బీఐ తెలిపింది. దాడికి ఉపయోగించిన ట్రక్కులో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ జెండా లభించినట్టు వెల్లడించింది. దాడి అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు జబ్బర్ మరణించిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలం నుంచి ఇంట్లో తయారు చేసిన పైప్‌బాంబులు, గ్రెనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి తీరును బట్టి ఒంటరిగా చేసినది కాకపోవచ్చని ఎఫ్‌బీఐ అనుమానిస్తున్నది.