టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లోని బస్ స్టేషన్ వద్ద భారీగా కాల్పులు జరిగాయి. (mass shooting in Israel) ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉగ్రవాదిగా భావిస్తున్న ఆ వ్యక్తి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు. ఇజ్రాయెల్‌లోని బీర్షెబా సెంట్రల్ బస్ స్టేషన్ వద్ద ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా 9 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఆ ఉగ్రవాదిని కాల్చి చంపినట్లు వెల్లడించారు. అదనపు పోలీస్ బలగాలను అక్కడకు రప్పించినట్లు వివరించారు.
కాగా, కాల్పుల్లో గాయపడిన తొమ్మిది మందికి చికిత్స అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ మెడికల్, డిజాస్టర్ విభాగమైన ఎండీఏ తెలిపింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. గాయపడిన వారిని బీర్షెబాలోని మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించింది.
మరోవైపు పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ దేశంలో కాల్పుల సంఘటనలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌లో వారం వ్యవధిలో సామూహిక కాల్పుల సంఘటన జరుగడం ఇది రెండోది. అక్టోబరు 1న ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో అనుమానాస్పద ఉగ్రవాద దాడి జరిగింది.
అలాగే జఫ్ఫాలో జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారు. లైట్ రైల్ స్టేషన్ సమీపంలోని జెరూసలేం స్ట్రీట్‌లో జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది మరణించగా మరో ఏడుగురు గాయపడినట్లు ఇజ్రాయెల్ పోలీసులు ధృవీకరించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు.