వాషింగ్టన్: మానవ చరిత్రలో తొలిసారి పంది గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి, రెండు నెలల తర్వాత మరణించారు. ఆయనకు ఈ సర్జరీ చేసిన అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి ఈ మేరకు బుధవారం ప్రకటించింది. అయితే ఆయన మరణానికి దారి తీసిన కారణాలను వెల్లడించలేదు. 57 ఏండ్ల డేవిడ్ బెన్నెట్ కొన్నేండ్లుగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు గుండె ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మానవ గుండె దాత లభించలేదు. దీంతో జీన్ ఎడిటింగ్, క్లోనింగ్ విధానంలో అభివృద్ధి చేసిన పంది గుండెను ఆయనకు అమర్చాలని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యలు నిర్ణయించారు.
రీజనరేటివ్ మెడిసిన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రెవివికార్ అనే కంపెనీ జన్యు మార్పిడి పందిని పేషెంట్‌కు డొనేట్ చేసింది. దీంతో జనవరి 7న సుమారు 8 గంటల పాటు సర్జరీ నిర్వహించిన అమెరికా వైద్యులు, డేవిడ్ బెన్నెట్‌కు పంది గుండెను మార్పిడి చేసి చరిత్ర సృష్టించారు. ఈ సర్జరీ విజయం కావడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఇక మానవ అవయవాల కొరతను జంతువుల అవయవాల ద్వారా అధిగమించవచ్చన్న ఆశ మరోసారి చిగురించింది.
అయితే ఆ ఆశ ఆవిరయ్యింది. డేవిడ్ బెన్నెట్ ఆరోగ్యం గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్నదని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పంది గుండె మార్పిడి సర్జరీ జరిగిన రెండు నెలల తర్వాత మంగళవారం ఆయన చనిపోయినట్లు ప్రకటించారు.
కాగా, వైద్యుల చివరి ప్రయత్నాన్ని బెన్నెట్ కుమారుడు అభినందించారు. మానవ అవయవ కొరతను అధిగమించే ప్రయత్నాలకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక ప్రయత్నం ఇక్కడితో ఆగకూడదని అన్నారు. మానవ అవయవ కొరతను అధిగమించే కొత్త ప్రయత్నాలకు ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.