ఢాకా : తుక్కుతో విమానం తయారుచేసిన ఓ బంగ్లాదేశ్ యువకుడు దాన్ని విజయవంతంగా గాల్లో నడిపి అందరినీ అబ్బురపరిచాడు. ఈ విమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎలాంటి అనుభవం లేని వ్యక్తి పూర్తిగా పట్టుదల, సృజనాత్మకత సాయంతో సాధించిన ఈ విజయం నెటిజన్లను ఆశ్చర్యపోయేలా, అవాక్కయ్యేలా చేస్తున్నది. ఏవియేషన్ వీడియోస్ అనే ఫేస్బుక్ పేజీలో ఈ విమానం టేకాఫ్ వీడియోను పంచుకుంటూ ఇలా రాశారు.. ‘మాణిక్గంజ్కు చెందిన 28 ఏండ్ల బంగ్లాదేశీ సృజనకారుడు జుల్హాస్ మొల్లా తేలికపాటి విమానాన్ని విజయవంతంగా నిర్మించి నడిపాడు.
వైమానిక శాస్త్రంలో ఎలాంటి శిక్షణ లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మూడేండ్ల పాటు పరిశోధించి, ఒక సంవత్సర కాలంలో ఈ విమానాన్ని నిర్మించాడు. ఇందుకోసం 8 లక్షల టాకాలు(రూ.5.66 లక్షలు) ఖర్చు చేశాడు’. ఈ విమానం బరువు సుమారు 100 కిలోలని, గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని ఆ పేజీలో పేర్కొన్నారు. ప్రతి 20-30 కి.మీలకు ఒక లీటర్ ఇంధనాన్ని ఈ విమానం ఉపయోగిస్తుంది. పంప్ ఇంజిన్లు, అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్‌తో ఈ విమానాన్ని నిర్మించారు.