Power outage : యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దాంతో లక్షల మంది జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. యూరోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో సమస్య ఉత్పన్నం కావడమే ఈ విద్యుత్ అంతరాయానికి కారణంగా తెలుస్తోంది.
ఈ సమస్యపై రెడ్ ఎలక్ట్రికా సంస్థ స్పందించింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. సమస్యకు కారణమేంటనే అంశాన్ని విశ్లేషిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. ఇదిలావుంటే తమ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు దేశంలోని జాతీయ విద్యుత్ గ్రిడ్ నిలిచిపోయినట్లు స్పెయిన్ జాతీయ రైల్వే కంపెనీ రెన్ఫే తెలిపింది.
దాంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు పేర్కొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వార్షిక మ్యాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నిలిచిపోయినట్లు తెలిసింది. మూడు దేశాల్లో రైళ్లు, విమానాల రాకపోకలపై, టెలీ కమ్యూనికేషన్లపై ప్రభావం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి.