దాదాపు 3 ఫుట్‌బాల్ గ్రౌండ్స్ అంత పెద్ద ఓడ అది.. అందులో ఆడి, లాంబోర్గినీ, పోర్ష్, వోక్స్వ్యాగన్ కంపెనీలకు చెందిన దాదాపు 4 వేల లగ్జరీ కార్లు.. ఆ ఓడలో మంటలు చెలరేగాయి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని పోర్చుగీస్ ద్వీపం తీరంలో బుధవారం నుంచి ఫెలిసిటీ-ఏస్ నౌక మంటల్లో దగ్ధమవుతూ, అజోర్స్ తీరం వెంబడి కొట్టుకుపోతున్నది. ఈ నెల 10న జర్మనీలోని ఎమ్డెన్ నుంచి బయలుదేరిన ఈ ఓడ.. అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని డేవిడ్విల్లేకు చేరుకోవాల్సి ఉన్నది. కానీ, బుధవారం మధ్యాహ్నం ఓడలో మంటలు చెలరేగాయి. దీంతో ఓడ నడిసంద్రంలోనే ఉండిపోయింది. సమాచారం అందుకొన్న పోర్చుగీస్ నేవీ, ఎయిర్‌ఫోర్స్.. ఓడలోని 22 మంది సిబ్బందిని కాపాడింది. ఓడలో వోక్స్‌వ్యాగన్‌కు చెందిన 3,965 కార్లు, పోర్ష్ కంపెనీకి చెందిన 1,100 కార్లు సహా వందల సంఖ్యలో ఆడి, లాంబోర్గినీ బ్రాండ్ వాహనాలు ఉన్నట్టు సమాచారం.