న్యూయార్క్ : కృత్రిమ మేధస్సు (ఏఐ)పై భారీగా పెట్టుబడులు పెడుతున్న అమెరికన్ కంపెనీలు, ఆ లక్ష్యాల సాధన కోసం విదేశీ నైపుణ్యతవైపే మొగ్గు చూపుతున్నాయి. విదేశీయుల నియామకాలను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచినప్పటికీ అమెరికన్ కంపెనీలు ఏమాత్రం వెనుకకు తగ్గడం లేదని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) ఓ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలోనే హెచ్1బీ వీసాలకు డిమాండ్ పెరుగుతున్నదని తెలిపింది. అమెరికాలో వలస నిబంధనలు మరింత కఠినతరం అవుతున్న సమయంలో ఈ పరిణామం ఆసక్తి గొలుపుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అగ్రస్థానం పొందాలన్న ఆకాంక్షనే ఆ కంపెనీలను విదేశీ నైపుణ్యత వైపు మొగ్గు చూపేలా చేస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది.
గత ఏడాది కొత్త హెచ్1బీ వీసాల కోసం టెక్ కంపెనీలు సమర్పించిన దరఖాస్తుల్లో 80 శాతానికి పైగా ఏఐకి సంబంధించినవేనని తెలిపింది. వీటిలో 60 శాతం దరఖాస్తులు ఐదు బడా కంపెనీలకు చెందినవేనని పేర్కొన్నది. అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీల్లో ఏఐ నిపుణుల నియామకాలు అధికంగా జరిగినట్టు వెల్లడించింది. ఈ ఐదు కంపెనీలు ఏఐ కోసం 2025, 2026 సంవత్సరాల్లో లక్ష కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నాయని ఫోర్బ్స్ రిపోర్ట్ పేర్కొన్నది. అధునాతన ఏఐ సాంకేతికతలో అమెరికన్లకు నైపుణ్యత లేకపోవడం వల్లనే కంపెనీలు విదేశీ నైపుణ్యతపై ఆధారపడుతున్నట్టు ఎన్ఎఫ్ఏపీ నివేదిక తెలిపింది. నిజానికి అమెరికాలోని యూనివర్సిటీల్లో కంప్యూటర్, శాస్త్ర సాంకేతిక శాస్ర్తాలను అధ్యయనం చేస్తున్న వారిలో 80 శాతం మంది విదేశీయులే కావడం గమనార్హం.