Five Police Killed | పాకిస్థాన్ ఖైబర్ ఫక్తుంక్వాలో సోమవారం భారీ పేలుడు జరిగింది. ఘటనలో ఐదుగురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. బజౌర్ జిల్లాలో పోలియో వ్యతిరేక కార్యక్రమానికి బందోబస్తు కోసం ట్రక్కులో తరలిస్తుండగా ఈ దాడి ఘటన చోటు చేసుకున్నది. ఐఈడీతో పేలుడు జరుపగా.. ఐదుగురు పోలీసులు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
దాడి జరిగిన సంఘటనా స్థలం బజౌర్లోని మాముండ్ ప్రాంతం. ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉంది. 2021 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిహద్దును ఆనుకొని పాక్లో దాడులు పెరిగాయి. దాడి ఘటనపై ఇంకా స్పందించలేదు. అయితే, ఈ ప్రాంతం షియాలు, సున్నీల మధ్య దాడులు జరుగుతుంటాయి. ఇదిలా ఉండగా.. గతేడాది ఖైబర్ పఖ్తుంక్వాలో 419 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇందులో 620 మంది మరణించారు. ఇందులో 306 మంది భద్రతా సిబ్బంది, 222 మంది పౌరులు, 92 మంది ఉగ్రవాదులు ఉన్నారు.