టోక్యో: జపాన్ తీరం మరోసారి భారీ భూకంపంతో (Japan Earthquake) వణికిపోయింది. శుక్రవారం ఉదయం ఈశాన్య జపాన్లోని కుజీ పట్టణంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 6.7గా నమోదైంది. తర్వాత భూకంప తీవ్రతను 6.5గా జపాన్ మెటలర్జీకల్ ఏజెన్సీ (JMA) ప్రకటించింది. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పసిఫిక్ తీరం వెంబడి అలలు 3 అడుగుల ఎత్తు ఎగసి పడతాయని వెల్లడించింది.
కాగా, 6.7 తీవ్రతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. హోన్షు ద్వీపంలోని ఇవాటే ప్రాంతంలో ఉన్న కుజి పట్టణానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నదని వెల్లడించింది. కాగా, గత సోమవారం 7.6 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. దీంతో జపాన్ వాతావరణ సంస్థ హొక్కాయిడో, ఔమోరి, ఇవాటే ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. జపాన్లో తరచూ భూకంపాలు రావడానికి కారణం ఏమిటంటే, ఈ భూభాగం పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పైన్ సీ ప్లేట్, యూరాసియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ కలిసే చోట ఉంది.