దుబాయ్ రాజు, యుఏఈ దేశ ప్రధాన మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్‌కు లండన్ హై కోర్టు భారీ షాక్‌నిచ్చింది. ఆయన ఆరవ భార్య రాజకుమారి హయా బింత్ అల్ హుసేన్(47) విడాకుల కేసులో షేక్ మొహమ్మద్ ఆమెకు 730 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.5,550 కోట్లు) భరణం కింద చెల్లించాలని ఆదేశింది. దీంతో ఈ భరణం కేసు బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భరణం కేసులలో ఒకటిగా మారింది.
జోర్డాన్ మాజీ రాజు కుమార్తె అయిన రాజకుమారి హయాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. ఆమె 2019లో దుబాయ్ వదిలి లండన్ పారిపోయి.. తన పిల్లల కస్టడీ కోసం బ్రిటన్ కోర్టుని ఆశ్రయించింది. ఇప్పుడామెకు పిల్లల కస్టడీ లభించడంతోపాటు భరణం కాకుండా వారి ఖర్చుల కోసం సంవత్సరానికి 11 మిలియన్ పౌండ్లు షేక్ మొహమ్మద్ చెల్లించాలని లండన్ కోర్టు చెప్పింది.
రాజకుమారి హయా తన సెక్యూరిటీ సిబ్బందితో వివాహేతర సంబంధం కలిగి ఉందని అనుమానంతో ఆమె భర్త దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ ఆమెను అరబీలో కవితల రూపంలో బెదిరించేవాడని.. అందుకే దేశం వదిలి పారిపోవాల్సి వచ్చిందని కోర్టుకు చెప్పింది. అంతకుముందు రాయల్ సెక్యూరిటీ సిబ్బందిలో కొందరు తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు రాజుకు చెప్పకుండా ఉండడానికి తన వద్ద ఉన్న డబ్బులు, పిల్లల బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు సైతం ఇచ్చానని చెప్పింది.
తన ఫోన్‌ని హ్యాక్ చేసి తన ప్రైవేట్ కాల్స్‌ని షేక్ మొహమ్మద్ వినేవాడని రాజకుమారి హయా చెప్పింది. దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ లండన్ కోర్టు తీర్పును అమలుపరచకపోతే దౌత్య పరమైన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.