లండన్, మార్చి 14: ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కొవిడ్ నిబంధనలను సడలించాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా మహమ్మారి ఇక అంతమైపోయినట్టే, మాస్కుల్లేకుండా మళ్లీ హాయిగా జీవనం సాగించవచ్చని భావిస్తున్న తరుణంలో ఐరోపా, ఆసియా దేశాల్లో కేసుల పెరుగుదల ఆందోళనను కలిగిస్తున్నది. వైరస్ మళ్లీ ప్రపంచం అంతటికి విస్తరిస్తుందేమోనన్న భయం మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ హెచ్చరికలను జారీ చేశారు.
చైనా ఉక్కిరిబిక్కిరి
కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్డౌన్ విధించింది. చైనాలో సోమవారం 1,807 కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్‌లోనూ వైరస్ విజృంభిస్తున్నది. నగరంలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో నగరాన్ని వీడుతున్నారు.
కొరియా సతమతం
దక్షిణ కొరియాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఇక్కడ ఏకంగా రోజుకు 3లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం 3.09 లక్షల మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 3 లక్షలకు పైగా కేసులు రావడం ఇది వరుసగా మూడోరోజు. దక్షిణ కొరియాలో మొత్తం కేసుల సంఖ్య 68 లక్షలు దాటింది. కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ కాంటాక్ట్ ట్రేసింగ్‌కు బదులుగా మరణాల నివారణకు చికిత్సపైనే దృష్టి పెట్టాలని దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. వియత్నాంలో సోమవారం 2.09 లక్షల కేసులు నమోదయ్యాయి.
వెయ్యి కోట్ల డోసుల పంపిణీ
ఐరోపాలోని జర్మనీలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. జర్మనీలో గడిచిన వారం రోజుల్లోనే కొత్తగా 13 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. యూకే, నెదర్లాండ్స్, ఐర్లాండ్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ కేసులతో పాటు దవాఖానలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్లోని బీఏ.2 వర్షనే మళ్లీ కరోనా ఉద్ధృతికి కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
36 వేలకు యాక్టివ్ కేసులు
ఇండియాలో ఆదివారం కొత్తగా 2,503 కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,15,877కు పెరిగింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 36,168కి పడిపోయింది. దేశంలో 180.19 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 0.47కు పడిపోయింది.