LNG carrier Disha : ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అధికారికంగా సంతకాలు చేయకపోయినప్పటికీ.. రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్, అమెరికా ప్రకటించాయి. దీంతో అక్కడి నుంచి వాణిజ్య నౌకలు కదులుతున్నాయి. తాజాగా ఇండియాకు చెందిన దిశ అనే ఎల్ఎన్జీ కలిగిన నౌక హార్ముజ్ జలసంధిని దాటింది. ఈ విషయాన్ని భారత నౌకారవాణ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన దిశ నౌకలో 62,370 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ ఉన్నట్లు కేంద్ర జలవనరులు, షిప్పింగ్, పోర్టుల శాఖ డైరెక్టర్ ఒపేష్ కుమార్ శర్మ వెల్లడించారు. హార్ముజ్ దాటిన ఈ నౌక గుజరాత్ తీరంలోని దహేజ్ పోర్టుకు జూన్ 18న చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మూడు నెలలుగా చమురు నౌకలు హార్ముజ్ వద్ద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అందులో అనేక భారత నౌకలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని నౌకలు మధ్యలో అక్కడి నుంచి బయటపడి గమ్యస్థానాన్ని చేరాయి. ఇండియాకు కూడా పలు నౌకలు చేరుకున్నాయి. కానీ, పూర్తిగా ఇండియాకు చెందిన నౌక మాత్రం ఇప్పటివరకు హార్ముజ్ నుంచి బయటపడలేదు. యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి హార్ముజ్ దాటిన తొలి భారత నౌక దిశ. మూడు నెలల అనంతరం ఒక భారత నౌక హార్ముజ్ దాటింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన నౌకలు కూడా త్వరలోనే అక్కడి నుంచి బయల్దేరి ఇండియా చేరుకునే అవకాశాలున్నాయి.
భారత నౌకలు త్వరగా, సురక్షితంగా ఇండియా చేరుకునేలా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని, వాటికి తగిన సహకారం అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఈ వ్యవహారంలో స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 12,700 కాల్స్ రిసీవ్ చేసుకున్నామని, 28,000 ఈ మెయిల్స్‌కు స్పందించామని ఒపేష్ కుమార్ శర్మ వివరించారు. సముద్రంపై చిక్కుకుపోయిన భారతీయుల రక్షణ కోసం ప్రయత్నించామన్నారు. ప్రస్తుతం 3,587 మంది సిబ్బంది వివిధ నౌకల్లో ఉన్నారని, ఇప్పుడు నౌక రవాణా సాధారణ స్థితికి చేరిందని చెప్పుకొచ్చారు.