ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సింహం (Lioness Escape) కలకలం సృష్టించింది. జూ నుంచి పారిపోయిన ఓ ఆడ సింహం (Lionees) రెండున్నర గంటలపాటు అధికారులను హడలెత్తించింది. ఢాకాలోని మీర్పూర్ (Mirpur) ప్రాంతంలో ఉన్న ఓ జూలో (Dhaka Zoo) తన బోనులో నుంచి ఆడ సింహం తప్పించుకున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు జంతు ప్రదర్శనశాల నుంచి సందర్శకులను ఖాళీచేయించారు. అనంతరం తప్పించుకున్న సింహం కోసం గాలింపు చెపట్టారు. రెండున్నర గంటల తర్వాత ఓ పొదల్లో సింహం కనిపింది. దీంతో మత్తు మందు ఇచ్చి దానిని బోనులోకి తరలించారు.
కాగా, శుక్రవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో సింహం బోనులో నుంచి తప్పించుకున్నదని జూ డైరెక్టర్ మహమ్మద్ ఇస్లామ్ తాలూక్దార్ తెలిపారు. మరికొంత ఆలస్యమైతే దానిని పట్టుకోవడం కష్టమయ్యేదన్నారు. జూలోని పొదల్లో అది దాక్కున్నదని, మత్తుమందు ఇచ్చి దానిని పట్టుకున్నామని చెప్పారు. బోనుకు రెండు వైపుల ఉన్న రెండు తలుపులకు తాళాలు లేవని అందుకే అది తప్పించుకున్నదని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు.