న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో హిజ్బొల్లాకు చెందిన కీలకమైన నేత హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లోని లెబనాన్ అంబాసిడర్(Lebanons Ambassador) రాబీ నర్స్ స్పందించారు. ఈ సందర్భంగా అహింసావాది మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ఆయన పేర్కొన్నారు. విప్లవ నాయకుడిని చంపవచ్చు కానీ, విప్లవాన్ని నిర్మూలించలేరని గాంధీ చెప్పిన వ్యాఖ్యలను అంబాసిడర్ రాబీ నర్స్ గుర్తు చేశారు. హిజ్బొల్లా .. ఓ న్యాయమైన రాజకీయ పార్టీ అని, ఆ పార్టీకి ప్రజల మద్దతు ఉన్నదని, ఆ పార్టీని ఎవరూ నాశనం చేయలేరన్నారు.
హిజ్బొల్లా నేతలను మీరు హతమార్చ వచ్చు కానీ, హిజ్బొల్లా పార్టీని ఏమీ చేయలేరన్నారు. ప్రమాదకరమైన ఇజ్రాయిల్‌పై హిజ్బొల్లా పోరాడుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోందని, ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తున్నదని, యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయిల్‌ను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారని అంబాసిడర్ ఆరోపించారు. సంక్షోభాన్ని ఆపాలని భారత్‌తో పాటు అనేక దేశాలను లెబనాన్ కోరినట్లు ఆయన చెప్పారు.
భారత్ నుంచి లెబనాన్‌కు వైద్య సంబంధమైన వస్తువుల్ని తరలిస్తున్నామని రాబీ నర్స్ తెలిపారు.