Lawrence Bishnoi : ఇండియాలో పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు, భారత ప్రభుత్వానికి మధ్య సంబంధాలున్నాయని కెనడా ఆరోపించింది. కెనడాలో ఇండియా ప్రభుత్వం తరఫున లారెన్స్ గ్యాంగ్ పని చేస్తోందని అక్కడి పోలీసు విభాగం ఆర్సీఎంపీ (రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్) వెల్లడించింది. లారెన్స్ బిష్ణోయ్, అతడి గ్యాంగును తీవ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి తాజాగా ఒక నివేదిక వెల్లడైంది.
అయితే, ఈ నివేదిక ఎప్పటిది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కొంతకాలంగా ఇండియా-కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. అతడిని చంపింది భారతీయులే అని, ఇందులో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని కెనడా ఆరోపించింది. లారెన్స్ గ్యాంగ్ ఈ పని చేసినట్లు తెలిపింది. అయితే, కెనడా చేసిన ఈ ఆరోపణల్ని ఇండియా ఖండించింది. తమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు అంతర్జాతీయ సమాజం ముందుంచాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. తాజాగా కెనడాలో భారత రాయబారి దినేష్ పట్నాయక్ కూడా ఇదే అంశంపై వ్యాఖ్యానించారు.
చాలా కాలంగా ఇండియాపై కెనడా ఆరోపణలు చేస్తోందని, కానీ, దీనికి తగిన ఆధారాలు మాత్రం చూపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కెనడా తీవ్రవాదులకు అడ్డాగా మారిందని విమర్శించారు. ఈ విషయం 40 ఏళ్లుగా తాము చెబుతున్నామని దినేష్ అన్నారు. కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నా, అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇరు దేశాలు తమ రాయబారుల్ని తొలగించుకున్నాయి. పది నెలల అనంతరం.. అంటే గత ఆగష్టులో ఇరు దేశాలు తిరిగి రాయబారుల్ని నియమించుకున్నాయి.