వాషింగ్టన్ : పక్కలో బల్లెంలా మారిన వెనిజువెలాపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే వెనిజువెలా చుట్టూ కరేబియన్ సముద్రంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తున్నది. తన బెదిరింపులకు వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో లొంగకపోవడంతో ఇక బలవంతంగానైనా ఆయనను గద్దె దించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎనిమిది యుద్ధ నౌకలు, అణ్వాయుధ సామర్థ్యమున్న ఒక జలాంతర్గామిని అమెరికా వెనిజువెలాకు అత్యంత సమీపంగా మోహరించింది. ఎఫ్-35 యుద్ధ విమానాలతో దాడికి పాల్పడే ఇతర వైమానిక యుద్ధ సామగ్రితో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధనౌక ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నది. వేల సంఖ్యలో అమెరికన్ మెరైన్స్ (నౌకాదళ కమాండోలు) యుద్ధ నౌకల్లో సిద్ధంగా ఉన్నారు. 1994లో హైతీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకున్న అమెరికా.. అప్పుడు కూడా ఇదే స్థాయిలో అక్కడ సైన్యాన్ని మోహరించింది.
మరోవైపు పోర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్‌లోని తమ సైనిక స్థావరాలను సైతం అమెరికా అప్రమత్తం చేసింది. ప్రస్తుతం వెనిజువెలా చుట్టూ సైనిక మోహరింపుపై అమెరికా రక్షణ శాఖ మరో కథనాన్ని వినిపిస్తున్నది. వెనిజువెలా నుంచి పనిచేస్తున్న రెండు ప్రధాన డ్రగ్స్ ముఠాలను అరికట్టేందుకు అక్కడ సైన్యాన్ని మోహరించినట్టు చెప్తున్నది. కేవలం డ్రగ్స్ రవాణాదారుల ఆటకట్టించేందుకు ఇంత పెద్ద సైన్యం అవసరం లేదని, అమెరికాకు మరేదో భారీ వ్యూహం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ మోహరించిన నౌకల నుంచి వెనిజువెలా ఉత్తర తీరాన ఉన్న లక్ష్యాలను ఛేదించవచ్చని అంటున్నారు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో నేరపూరితమైన పాలన సాగిస్తున్నాడని ట్రంప్ ఎప్పటి నుంచో మండిపడుతున్నారు. మదురోను పట్టిచ్చిన వారికి 50 మిలియన్ డాలర్ల బహుమతిని ఆయన ప్రకటించారు. ఉభయ దేశాలకు మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా అన్నారు.