Protests : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్‌తోపాటు బిలియనీర్ మస్క్ చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం వేల మంది నిరసనకారులు నార్త్ కరోలినాలోని షాలెట్, మస్సాచుసెట్స్‌లోని బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా పలుచోట్ల భారీ నిరసనలు చేపట్టారు.
‘హ్యాండ్స్ ఆఫ్’ పేరిట నిర్వహించిన ఈ నిరసనల్లో 150కి పైగా గ్రూపులుగా 1200 మంది పాల్గొన్నారు. ఆందోళనకారుల్లో పౌరహక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు సరిగాలేవని, ప్రజల అవసరాలతో పనిలేకుండా వ్యవహరిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవట్లేదని, భారీగా ఉద్యోగాల కోత వల్ల అమెరికాలో సేవలు, వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్య, సామాజిక భద్రత, మెడిక్ ఎయిడ్, మెడికేర్, మాజీ సైనికుల హక్కులు, LGBTQ సమాజం ఇలా ప్రతి ఒక్కటి సవ్యంగా లేవని మండిపడ్డారు.
#WATCH | Washington, US | Large number of protesters hold demonstrations against the Trump administration’s policies and executive orders. pic.twitter.com/hLNf3sajRK
— ANI (@ANI) April 5, 2025
ఈ నిరసనలపై శ్వేతసౌధం స్పందించింది. సామాజిక భద్రత, మెడిక్ ఎయిడ్‌లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తారని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ట్రంప్ పరస్పర టారిఫ్‌ల నిర్ణయం వేళ ప్రపంచ కుబేరుడు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ కీలక విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా, ఐరోపా చాలా సన్నిహితమైన, బలమైన భాగస్వామ్యాన్ని సృష్టించగలవని పేర్కొన్నారు. ఎలాంటి పరస్పర పన్నులు లేని జీరో టారిఫ్ జోన్‌కు చేరుకోగలవని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటలీ లీగ్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఓ వీడియోలింక్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు అమెరికాలో ఉద్యోగాల కుదింపు కొనసాగుతోంది. తాజాగా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్ఎస్) చెందిన 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దాదాపుగా 25 శాతంతో సమానం. శుక్రవారం నుంచే పౌర హక్కుల కార్యాలయం నుంచి ఈ తొలగింపును అధికారులు ప్రారంభించారు. ఆ కార్యాలయాన్ని మూసివేసి అక్కడి ఉద్యోగులను చీఫ్ కౌన్సెల్ కార్యాలయానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. గత ఫిబ్రవరిలో కూడా 7,000 మంది తాత్కాలిక ఉద్యోగులను ఈ విభాగం నుంచి తొలగించారు.