Srilanka PM Home | శ్రీలంకలో అసాధారణ స్థాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. రోజువారీగా ఆహార ధాన్యాలకు, ఇతర అవసరాల కోసం అల్లాడిపోతున్నారు. దీంతో నిరసనకారుల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. రాజధాని కొలంబోలో గల ప్రధాని పదవికి రాజీనామా చేసిన రణిల్ విక్రమసింఘే సొంతింటికి శనివారం సాయంత్రం నిప్పు పెట్టారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి నిరసనకారులు దూసుకెళ్లారు. ఇంటికి నిప్పు పెట్టారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన మంత్రి కార్యాలయంలోకి వచ్చిన నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా వెనక్కి తగ్గలేదు. ప్రధానమంత్రికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో నాటి ప్రధాని మహీంద్రా రాజపక్సె రాజీనామా చేశారు. దీంతో గత మే నెలలో ప్రధానిగా విక్రమసింఘేను అధ్యక్షుడు గోటబయా రాజపక్సె నియమించారు. కానీ పరిస్థితులు విషమించడంతో విక్రమసింఘే తానూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రజల భద్రత కోసం తన పార్టీ నేతల సిఫారసుల మేరకు అఖిల పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు శనివారం ఉదయం అధ్యక్షుడు గోటబయా రాజఫక్స తన అధికారిక నివాసం నుంచి పరారయ్యారు. ఆయన పరార్ కాగానే నివాసంలోకి నిరసనకారులు పోటెత్తారు. గందరగోళం మధ్య శ్రీలంక నేవీ నౌకలో సూట్‌కేస్‌లతో పరారైనట్లు సమాచారం. ఆ సూట్‌కేస్‌లు గోటబయావేనని స్థానిక మీడియా ఆరోపించింది.