ఖార్తుమ్ (సూడాన్), సెప్టెంబర్ 2 : ఆఫ్రికా దేశం సూడాన్‌లో భారీగా విరిగిపడిన కొండ చరియలు ఒక గ్రామాన్నే తుడిచిపెట్టేశాయి. పశ్చిమ సూడాన్‌లోని డార్ఫర్ రీజియన్‌లో ముర్రా పర్వతాల సమీపంలో ఉన్న గ్రామంపైకి ఆగస్టు 31న భారీ వర్షం కారణంగా పెద్దయెత్తున కొండ చరియలు విరిగిపడటంతో సుమారు వెయ్యి మంది పౌరులు మరణించారు. ఈ ప్రమాదం నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు సూడాన్ లిబరేషన్ ఆర్మీ సోమవారం తెలిపింది.
మృతులలో పురుషులతో పాటు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి అబ్దుల్ వాహిద్ మహమ్మద్ తెలిపారు. బండరాళ్లు ఇళ్లను నుగ్గినుగ్గి చేశాయని, ఇప్పుడు ఆ ప్రాంతమంతా చదును చేసినట్టుగా మారిపోయిందని చెప్పారు. మృత దేహాలను వెలికితీయడానికి ఐరాస, అంతర్జాతీయ సంస్థలు సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.