ఇస్లామాబాద్, జూలై 11: పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో రియాద్ నుంచి వస్తున్న ఈ విమానం దిగే సమయంలో ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగాయి. విపత్తు నివారణ సిబ్బంది అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
గురువారం ఈ విమానం పెషావర్ బచ్చా ఖాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగే సమయంలో ఎడమ వైపు ల్యాండింగ్ గేర్ నుంచి పొగ, నిప్పురవ్వలు రావడాన్ని గమనించిన ట్రాఫిక్ కంట్రోలర్లు పైలట్‌ను హెచ్చరించారు. తర్వాత ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక, ఇతర విపత్తు నివారణ విభాగాలను కూడా అప్రమత్తం చేశారు.
పౌర విమానయాన విభాగం (సీఏఏ) సిబ్బంది వెంటనే విమానం వద్దకు చేరుకుని మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక నిరోధకాలను ప్రయోగించారు. దీంతో మంటలు ఆగిపోయి పెద్ద ప్రమాదం తప్పింది. తర్వాత ప్రయాణికులు, సిబ్బందిని జారుడు స్లయిడ్ ద్వారా విమానంలోంచి దింపారు.