Lahore pollution : పొరుగు దేశం పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో కాలుష్యం అత్యంత తీవ్రమైంది. లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది. నగరం అంతటా నల్లటి విషపు పొగలు వ్యాపించాయి. దాంతో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 1900 దాటింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరానికి చెందిన సుమారు 15 వేల మంది రోగులు ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు.
లాహోర్లోని ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వానికి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. కాలుష్యానికి సంబంధించిన ప్రధాన కారణాలను గుర్తించి వాటిని పూర్తిగా నియంత్రించాలని సూచిస్తున్నారు. ప్రజా రవాణాను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని, ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించాలని చెబుతున్నారు.
లాహోర్లోని పలు ఆస్పత్రులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి దగ్గు, న్యుమోనియా, తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. మాయో ఆస్పత్రిలో నాలుగు వేల మందికిపైగా రోగులు, జిన్నా ఆస్పత్రిలో 3,500 మందికిపైగా రోగులు, గంగారామ్ ఆస్పత్రిలో మూడు వేల మందికి పైగా రోగులు, చిల్డ్రన్స్ ఆస్పత్రిలో రెండు వేల మందికి పైగా రోగులు చేరారు. ఈ ప్రమాదకర వాతావరణంలో తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.