మాస్కో: అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్, రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఇవాళ రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు వస్తున్న వార్తలను రష్యా ఖండించింది. పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు ప్రముఖ వాషింగ్టన్ పోస్టు పత్రిక ఓ కథనాన్ని రాసింది. ఆ వార్తలను పెస్కోవ్ తప్పుపట్టారు. గౌరవప్రదమైన మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నట్లు పేర్కొన్నారు. పుతిన్, ట్రంప్ మధ్య సంభాషణ జరిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇది కల్పితమని, తప్పుడు సమాచారం అని ఆయన తెలిపారు. పుతిన్, ట్రంప్ సంభాషణ గురించి ఉక్రెయిన్ ప్రభుత్వానికి ముందే చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు రాసిన కథనాన్ని కూడా కీవ్ ఖండించింది.