మాస్కో: రష్యాకు చెందిన రాజకీయ నాయకుడు కిర్సాన్ ఇల్యూంజినోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రహాంతరవాసులు తనను కిడ్నాప్ చేసిన మాట వాస్తవమేనని పునరుద్ఘాటించారు. ఏలియన్స్ తనను స్పేష్షిప్లో తీసుకెళ్లారని చెప్పారు. కిర్సాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. కాల్మికియా రీజియన్ మాజీ అధ్యక్షుడైన ఇల్యూంజినోవ్ కిర్సాన్ చెప్పిన వివరాల ప్రకారం 1997 సెప్టెంబర్ 18న మాస్కోలోని తన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు బాల్కనీలో నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తే వెళ్లి చూశానని, అక్కడ పసుపు రంగు స్పేష్సూట్స్ ధరించిన కొందరు కనిపించారని తెలిపారు. వారు తనను బంధించి, స్పేష్షిప్లో దూరప్రాంతానికి తీసుకెళ్లారని వివరించారు. తాను వెళ్లడానికి నిరాకరించినప్పటికీ బలవంతంగా తీసుకెళ్లారని చెప్పారు. వారు ఎలాంటి భాషను ఉపయోగించలేదని, కేవలం సైగల ద్వారా మాత్రమే భావాలను పంచుకున్నట్టు వివరించారు.