Kamala Harris | న్యూయార్క్: నవంబర్‌లో జరిగే అగ్రరాజ్య ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ తొలిసారిగా ముఖాముఖీ తలపడ్డారు. గత డిబేట్లో ట్రంప్ వైపే స్పష్టంగా మద్దతు చూపిన మీడియా, ఈసారి మాత్రం కమలా హారిస్‌కు ఎడ్జ్ ఇచ్చింది. మంగళవారం రాత్రి వీరిరువురికి మధ్య జరిగిన సంవాదంలో ఆర్థిక వ్యవస్థ, గర్భ విచ్ఛిత్తి నుంచి వలస విధానం వరకు పలు అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది.
90 నిముషాల పాటు జరిగిన ఈ చర్చలో హారిస్ కొన్ని సమయాల్లో సంభాషణను నియంత్రించారు. ట్రంప్‌ను అతని ఆర్థిక విధానంలోని లోపాలను ఎత్తి చూపారు. అలాగే 2020 ఎన్నికల్లో పరాజయాన్ని ట్రంప్ అంగీకరించడానికి నిరాకరించడం, సభలలో అతని వ్యవహార శైలిపై చురకలంటించారు. అయితే ట్రంప్ పలుసార్లు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. సమయం గడిచే కొద్దీ ఆయనలో చికాకు కన్పించింది.
హారిస్ ఆరోపణలను సమర్థించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించినట్టు కన్పించగా, హారిస్‌లో దృఢ విశ్వాసం, దూరదృష్టి కన్పించాయని పలువురు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. గత జూన్‌లో ట్రంప్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జరిపిన సంవాదం కన్నా హారిస్ చక్కగా తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు. అప్పటి సంవాదంలో పలుసార్లు బైడెన్ తడబడగా, హారిస్ మాత్రం సూటిగా సమాధానం చెబుతూ తనకు, ట్రంప్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రస్ఫుటింప చేశారు.
కమల ఇయర్ రింగ్స్‌లో సీక్రెట్ డివైస్!
డిబేట్ సమయంలో కమల ఇయర్రింగ్స్లో రహస్య వినికిడి పరికరం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించిన ఓ వ్యాసంలో ఓ మహిళ ధరించిన కర్ణాభరణం వంటి ఇయర్పీస్తో కమల ధరించిన ఇయర్ రింగ్స్‌ని పోల్చి చూపిస్తున్నారు. ‘ట్రంప్‌తో చర్చలో కమల బాగా మాట్లాడారు. కానీ ఆమె కర్ణాభరణాలు నాకు ఆసక్తికరంగా మారాయి. అవి చెవి రింగుల మాదిరిగా కనిపించే ఓ ఇయర్‌ఫోన్ గురించి ఓ టెక్ ఆర్టికల్ గుర్తుకు వచ్చింది’ అని ఓ ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.